Vijayawada Metro Rail : విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు మొత్తం 66.2 కిలోమీటర్ల పొడవుతో ఫేజ్ 1A, ఫేజ్ 1B, ఫేజ్ 2గా మూడు దశలుగా విభజించబడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ ప్రాజెక్టుకు జూలై 25, 2025న టెండర్లు పిలవడం జరిగింది. రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాన్ని అందించనుంది.
ఫేజ్ 1A – గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్
ఫేజ్ 1A కారిడార్ 25.9 కిలోమీటర్ల పొడవుతో గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో 23 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రోగా, 2.9 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రోగా నిర్మించబడనుంది. ఈ రూట్‌లో గన్నవరం, యోగాశ్రం, కీసరపల్లి, నిడమానూరు, రామవరప్పాడు, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ వంటి 23 స్టేషన్లు ఉంటాయి. ఈ రూట్ ఏలూరు రోడ్‌ను అనుసంధానిస్తుంది.
ఫేజ్ 1B – పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు
ఫేజ్ 1B కారిడార్ 12.5 కిలోమీటర్ల పొడవుతో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు విస్తరిస్తుంది. ఈ రూట్ పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుంది. ఈ రూట్‌లో విక్టోరియా మ్యూజియం, బెంజ్ సర్కిల్, ఆటో నగర్, కృష్ణా నగర్, పెనమలూరు వంటి 12 స్టేషన్లు ఉంటాయి. ఈ రూట్ బందర్ రోడ్‌ను కవర్ చేస్తూ ఫేజ్ 1లో మొత్తం 38.4 కిలోమీటర్లను పూర్తి చేస్తుంది.
ఫేజ్ 2 – అమరావతి రిజర్వాయర్ వరకు
ఫేజ్ 2 కారిడార్ 27.8 కిలోమీటర్ల పొడవుతో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రిజర్వాయర్ స్టేషన్ వరకు విస్తరిస్తుంది. ఇందులో 4.7 కిలోమీటర్లు ఎలివేటెడ్‌గా, 23.1 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్‌గా నిర్మించబడనుంది. కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ ఫేజ్‌లో భాగం. ఈ రూట్‌లో మహానాడు, ఉండవల్లి, తాళ్లాయపాలెం, అసెంబ్లీ స్టేషన్, అమరావతి రిజర్వాయర్ వంటి స్టేషన్లు ఉంటాయి. ప్రస్తుతం ఫేజ్ 1పై ప్రభుత్వం దృష్టి సారించి, టెండర్ల ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనుంది.

