Traffic : సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే బోనాల మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి. జులై 13న బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లక్షలాది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహంకాళి ఆలయం నుంచి టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ రోడ్లను పూర్తిగా మూసివేయగా, సుభాష్ రోడ్డు, బాటా నుంచి రోచా బజార్, జనరల్ బజార్ వరకు రోడ్లు కూడా మూతబడతాయి. భక్తులు తమ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో మాత్రమే పార్క్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ట్యాంక్‌బండ్, తాడ్‌బన్, బేగంపేట వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. కర్బలా మైదాన్ నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, పీఎన్టీ ఫ్లైఓవర్ మీదుగా మళ్లించబడతాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే బస్సులు చిలకలగూడ, గాంధీ దవాఖాన మీదుగా వెళతాయి. ప్యారడైజ్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలు ప్యాట్నీ, సంగీత్ చౌరస్తా, ముషీరాబాద్ మీదుగా చేరుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

