Mahesh Babu : రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం, సాయి సూర్య డెవలపర్స్‌పై దాఖలైన ఫిర్యాదులో స్టార్ హీరో మహేష్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది. బాధితులు తమ ఫిర్యాదులో, మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్‌ను చూసి ఆకర్షితులై, బాలాపూర్‌లో ప్లాట్ కొనుగోలు చేసేందుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు రూ.34.8 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు.
కొంతకాలం తర్వాత, ఆ ప్లాట్‌కు సంబంధించిన లేఅవుట్ అసలు లేదని తెలిసి, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు సంస్థను కోరగా, కేవలం రూ.15 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని ఆరోపించారు. మిగిలిన మొత్తం రీఫండ్ కోసం మరియు తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం మహేష్ బాబుతో పాటు సాయి సూర్య డెవలపర్స్ నిర్వాహకులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సంబంధించి మహేష్ బాబు ఎలాంటి పాత్ర పోషించారనేది విచారణలో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.
ఈ వ్యవహారం గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుకు కూడా సంబంధం కలిగి ఉంది. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్‌లపై ఈడీ దాడులు చేసిన సందర్భంలో మహేష్ బాబు సంస్థ నుంచి రూ.5.9 కోట్లు ప్రచారం కోసం తీసుకున్నట్లు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ కేసులో మహేష్ బాబు నేరుగా పాల్గొన్నట్లు ఆధారాలు లేవని, కేవలం ప్రచార ఒప్పందంలో భాగంగా ఆయన పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

