Corona : భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా నాలుగు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్లను LF.7, XF.G, JN.1.16, NB.1.8.1గా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మే నెల నుంచి XF.G వేరియంట్ దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో 6,483 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి, వీటిలో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు.
గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జూన్‌లో ఒక రోజు గరిష్ఠంగా 10 మరణాలు నమోదయ్యాయి, ఇది కొత్త వేరియంట్ ప్రభావానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అత్యధిక కేసులను నమోదు అవుతన్నాయి.
కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే మంత్రులకు కూడా టెస్టింగ్ నిర్బంధంగా మారింది. ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్‌లు, ఆక్సిజన్ సరఫరా సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, టీకాలు వేయించుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది.

