Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. రాజస్థాన్‌లో వాయుగుండం కొనసాగుతూ బుధవారం నాటికి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర రాజస్థాన్ మీదుగా ప్రయాణించనుంది. అలాగే, ఉత్తర ఝార్ఖండ్, దక్షిణ బిహార్‌లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ ఉత్తర్‌ప్రదేశ్ వైపు పశ్చిమ-వాయవ్య దిశగా సాగనుంది. రాజస్థాన్, ఝార్ఖండ్, బిహార్ నుంచి బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఉండటంతో, బుధ, గురువారాల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బుధ, గురువారాల్లో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదై, 4 నుంచి 7 డిగ్రీల వరకు పెరిగాయి.

