Engineering students : బాపట్ల జిల్లా అద్దంకిలో యూట్యూబ్‌లో బైక్ తాళాలు తీసే విధానం నేర్చుకొని దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలోని అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. అరెస్టయిన విద్యార్థుల్లో ఆరుగురు ఒంగోలులో, ఒకరు కందుకూరులో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విద్యార్థులు యూట్యూబ్ వీడియోల ద్వారా బుల్లెట్ బైక్‌ల తాళాలు తీసే టెక్నిక్‌లను నేర్చుకొని, అద్దంకి, నరసరావుపేట, మద్దిపాడు, చిలకలూరిపేట, జె.పొంగులూరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరు ఇప్పటివరకు 16 బుల్లెట్ బైక్‌లు, ఒక స్కూటీని దొంగిలించారు. ఈ వాహనాల విలువ సుమారు 25.20 లక్షల రూపాయలుగా బాపట్ల జిల్లా పోలీసులు అంచనా వేశారు.
బుల్లెట్ బైక్‌లు మాత్రమే దొంగతనానికి గురవడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. టవర్ డంప్ టెక్నాలజీని ఉపయోగించి నిందితుల ఆచూకీని గుర్తించిన పోలీసులు, చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో ఏడుగురు విద్యార్థులను అద్దంకిలో అరెస్టు చేశారు. అద్దంకి పట్టణానికి సమీపంలో దొంగిలించిన 16 బుల్లెట్ బైక్‌లు, ఒక స్కూటీని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దొంగతనాలకు సంబంధించి అద్దంకిలో 9 కేసులు, నరసరావుపేటలో 1, మద్దిపాడులో 1, చిలకలూరిపేటలో 2, జె.పొంగులూరులో 2 కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను కోర్టులో హాజరుపరిచి, విచారణ కొనసాగుతోంది.ఈ ఘటన స్థానికంగా ఆశ్చర్యం కలిగించడంతో పాటు, విద్యార్థులు సాంకేతికతను దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

